Parents Celebrate Son Who Failed in SSC : పరీక్షల్లో పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతేనో లేక పాస్ అయితేనో ఎవరైనా సంబరాలు జరుపుకుంటారు. కానీ కర్ణాటక బాగల్‌కోట్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేశారు. కేట్ కట్ చేయించి మరీ వేడుకలు నిర్వహించారు.
బాగల్‌కోట్‌లోని బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అభిషేక్ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకుగాను 200 మాత్రమే సాధించి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పాడు. ఎవరూ ఊహించని విధంగా అతని తల్లిదండ్రులు- కుమారుడితో కేక్ కట్ చేయించి దానిపై పిల్లాడి మార్కులు రాయించి సెలబ్రేట్ చేశారు. తమ కుమారుడు విఫలమైంది పరీక్షల్లోనే కానీ జీవితంలో కాదని చెప్పారు. మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని వారు తెలిపారు. తాను ఫెయిల్ అయినా తల్లిదండ్రులు తనను ప్రోత్సహిస్తున్నారని విద్యార్థి అభిషేక్ చెప్పాడు. మళ్లీ పరీక్ష రాసి పాసవుతానని చెప్పాడు. జీవితంలో కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశాడు.