Heavy rain in Hyderabad : హైదరాబాద్‌లో ఉన్నట్లుండి సడెన్‌గా వాతావరణంలో మార్పు సంభవించి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్‌పల్లి, గగిల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
అకస్మాత్తుగా పడుతున్న వర్షంతో వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలోనే తడుచుకుంటూ ద్విచక్ర వాహనాలపై వెళుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనావేసింది. హైదరాబాద్‌లో ఇవాళ, రేపు 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇవాళ సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.