Telangana Assembly : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని అన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సూచించారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని తెలిపారు.
"ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతోంది. 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ను 25 ఏళ్లు నిలిపివేశారు. డీలిమిటేషన్‌పై గందరగోళం నెలకొంది. ఇటీవల తమిళనాడు సీఎం డీలిమిటేషన్‌పై సమావేశం ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను వాజపేయి కూడా వ్యతిరేకించారు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి