TG SSC Exams 2025 : పదోతరగతి వార్షిక పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4వరకు జరగున్న పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2,58,895 మంది అబ్బాయిలు కాగా, 2,50,508 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డీవోలను నియమించింది. ఇప్పటికే పాఠశాలల ద్వారా విద్యార్థులకు హాల్టికెట్లను జారీ చేశారు.
పది పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా పదో తరగతి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించినట్లు తెలిపింది. ఎక్కడైనా ప్రశ్నపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించేందుకు ఆ నెంబర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 040 23230948 నంబర్ కు ఫోన్ చేయవచ్చని వెల్లడించింది.