BRS Leader KTR on Governor Speech : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నోటి వెంట అబద్ధాలు చెప్పించినందుకు తాము బాధపడుతున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గవర్నర్ స్థాయిని దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని చాటుకుందని ఇది గవర్నర్కు అవమానమని మండిపడ్డారు. ఈ విషయాన్ని గవర్నర్ కూడా గుర్తించాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని గవర్నర్ మందలిస్తారేమోనని అనుకున్నామని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.
చావు డప్పు కొట్టాల్సిన చోట డీజే తరహాలో డప్పు కొట్టారని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు స్వాంతన చేకూర్చే ప్రకటన ఉంటుందనుకున్నామని, లక్షల ఎకరాల్లో పంట ఎండుతుంటే కనీసం పట్టించుకునే మంత్రే లేరని ధ్వజమెత్తారు. ప్రభుత్వం రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేసి కూడా కొత్త పథకం అమలు చేయలేదని దుయ్యబట్టారు. దావోస్లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.