SLBC Tunnel Rescue Update : ఎస్ఎల్బీసీ సొరంగంలో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. అనుమానిత D-1, D-2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. కాగా మంగళవారం మరోమారు సొరంగంలోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ మరో అనుమానిత ప్రాంతాన్ని సైతం సూచించినట్లు తెలుస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం కోసం సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవాళ్టి నుంచి రోబోలు సైతం లోపలికి వెళ్లనున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించేందుకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మిగిలిన ఏడుగురు కోసం అన్వేషణ వేగవంతం చేశారు. D-2 అనే అనుమానిత ప్రాంతంలో మిగిలిన వారి మృతదేహాలు ఉంటాయనే అంచనాతో తవ్వకాల్ని ముమ్మరం చేశారు. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనట్రేటింగ్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో D-2 కూడా ఉంది. ఆ తర్వాత కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ కూడా అక్కడే మృతదేహాలు ఉంటాయని సంకేతాలిచ్చాయి. D-2 పరిధిని విస్తృతం చేసి తవ్వుతున్నారు. మట్టిలోపల టన్నెల్ బోరింగ్ మిషన్ కేబుళ్లు, ఉక్కు రేకులు, ఇతర శకలాలు అడ్డుపడుతుండటంతో ఒక్కొక్కటి కట్టర్లతో కత్తిరిస్తూ లోతుకు వెళ్తున్నారు.