Telangana Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం సుమారు 6.39 గంటలకుపైగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏకసభ్య కమిషన్ సిఫార్సులు, సమగ్ర కుల గణన డేటాపై కేబినెట్ చర్చించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు బీసీ రిజర్వేషన్ల ముసాయిదా బిల్లును ఆమోదించింది.
విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మరో బిల్లును రూపొందించారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును కూడా ఈనెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఎస్సీల్లోని 59 ఉపకులాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ గతంలో చేసిన సిఫార్సులనే యథాతథంగా ఆమోదించింది. రిజర్వేషన్ల శాతం మార్చాలని వచ్చిన వినతులను పునఃసమీక్ష చేసినా కమిషన్ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.