Graduate MLC Election : ఎంతో ఉత్కంఠ రేపిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలగా కాంగ్రెస్ సిటింగ్ సీటును కోల్పోయింది.
ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది బరిలో నిలవగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోరు నడిచింది. మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా, గత నెల 27న జరిగిన పోలింగ్లో 2,52,029 మంది ఓటేశారు. ఆ ఓట్లలలో 28,686 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,23,343 ఓట్ల నుంచి గెలుపు కోటాను 1,11,672 ఓట్లుగా అధికారులు నిర్ణయించారు.