BJP Candidate Anji Reddy Wins in Graduate MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగింది. 3 రోజుల పాటు సాగిన లెక్కింపు ప్రక్రియలో విజయం దోబూచులాడి చివరకు బీజేపీ అభ్యర్థిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అంజిరెడ్డి విజయం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాల వెల్లడిపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విజేతను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.