అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాత్రికేయులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంతకల్లులోని ధోనిముక్కల రోడ్డు సమీపంలో తహసీల్దార్‌తో కలిసి ఇళ్ల పట్టాల పరిశీలనకు వెళ్లిన ఆయన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం జరిగింది. తనపై, తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే తన ఎదుటనే అడగాలని, తాను వెళ్లిపోయాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ వీడియోపై పలు జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.