HYDRA Commissioner Press Meet : హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందన్నారు. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్జోన్లు నిర్ణయిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో హైడ్రా కమిషన్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని వివరించారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేస్తామని వెల్లడించారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్తో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయన్నారు.