లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ, ఒకేసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే అస్త్రాన్ని ఎంచుకుంది. సుంకిశాల గోడ కూలిపోవడం కాషాయ దళానికి ఆయుధంగా దొరికింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు 2022లో శంకుస్థాపన చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు కొనసాగుతుండగా గోడ కూలిపోయింది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఇవాళ సుంకిశాల ప్రాజెక్టును బీజేపీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. కూలిన పంప్ హౌస్ రిటైనింగ్ వాల్‌ను పరిశీలించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు సంధించింది.