రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు. అనేక సందర్బాల్లో ఈ విషయం రుజువైంది కూడా.. నిన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు 2019 సాధారణ ఎన్నికల్లో స్నేహగీతం పాడబోతున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,కాంగ్రెస్ పొత్తుపైన ఆసక్తికరమైన చర్చ రంభమైంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఊపందుకుంది.
కేంద్రంలో జాతీయ పార్టీ అండ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ తో దోస్తీ చేయడం ఖాయమన్న రీతిలో వార్తలు వస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం అయ్యే సూచనలు లేకపోవడంతో తెలుగుదేశం తన చిరకాల ప్రత్యర్థిని మిత్రుడిగా మార్చుకుంటుందని చెపుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభించినట్లు జగన్ టీం ప్రచారం చేస్తోంది. అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్,టీడీపీలు సమాలోచనలు మొదలుపెట్టారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్,టీడీపీ పొత్తు సాధ్యమేనా...? చంద్రబాబు రాహుతో చేతులు కలపడం జరిగే పనేనా..? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.టీడీపీ ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా కనిపించిన తెలుగుదేశం,బీజేపీ ఇప్పుడు కత్తులు నూరుతున్నాయి.