ఓ ప్రయాణికుడు అప్రమత్తతో చేసిన ఒక్క ట్వీట్ 26మంది బాలికలను పెను సంకటం నుంచి కాపాడింది. ఆయన ట్వీట్‌కు వెంటనే స్పందించి రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లుగా భావిస్తున్న 26 మంది మైనర్ బాలికలకు.. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే పరిరక్షక దళం (ఆర్‌పీఎఫ్) విముక్తి కల్పించాయి. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌పుర్ నుంచి బాంద్రాకు వెళ్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ బాలికలు ప్రయాణించారు. వారిని అక్రమంగా తరలిస్తున్నారనే సందేహంతో ఆదర్శ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి గురువారం రైల్వేశాఖకు ట్వీట్ చేశారు.
దాదాపు 25 మంది బాలికలు ఇబ్బందిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. వారిలో కొందరు రోధిస్తున్నారు. ప్రస్తుతం రైలు హరినగర్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఉంది' అని పేర్కొన్నారు. దీనికి వారణాసి, లక్నోల్లోని అధికారులు వెంటనే స్పందించారని.. అరగంటలోపే విచారణ చేపట్టారని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఇద్దరు ఆర్‌పీఎఫ్ జవాన్లు సాధారణ ప్రయాణికుల్లా కప్తాన్‌గంజ్‌లో ఆ రైలు ఎక్కారని.. గోరఖ్‌పుర్ వరకు బాలికలకు రక్షణగా ఉన్నారని పేర్కొన్నారు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మొత్తం 26 మంది బాలికలను కాపాడమని.. వారి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆర్‌పీఎఫ్ తెలిపింది.
బాధిత బాలికలు బీహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని, వారిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించామని తెలిపింది. దీంతో శ్రీవాస్తవ రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 26మంది బాలికలను కాపాడిన ఆదర్శ్ శ్రీవాస్తవపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రం ప్రభుత్వం అతన్ని తగిన విధంగా గౌరవించాలని కోరుతున్నారు.