On the heat of special status for AP leads to many circumstances.Hindupur MLA Balakrishna Passed Comments against BJP.
దేశం, రాష్ట్రం బాగుండాలంటే ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపాలని గుంటూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆదివారం గుంటూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వకుండా అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ ఆందోళన చేయించారని ఆరోపించారు. సభాపతి సుమిత్రా మహాజన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించి ప్రధాని మోడీకి వత్తాసు పలికారన్నారు. రానున్న ఎన్నికల్లోగా మరో మూడు విడతల పార్లమెంటు సమావేశాలు ఉంటాయని, ఏపీకి న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు.
కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారని, కానీ బీజేపీ నేతలు మాత్రం కేంద్రంలోని పెద్దలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కూడా అదే గతి పడుతుందన్నారు.
మన దేశంలో ఉన్నవారే, మనకు సహకరించాల్సిన వారే శత్రువులుగా మారుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరోక్షంగా మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరదేశీయుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడిన గౌతమీపుత్ర శాతకర్ణి దెబ్బ కేంద్రానికి తెలియాలని, వారికి కనువిప్పు కలిగించాలన్నారు.
కృష్ణా నీటితో పెన్నానదిని అనుసంధానిస్తామని బాలకృష్ణ చెప్పారు. నాడు తెలుగుగంగ ద్వారా రాష్ట్రానికే కాక చెన్నైకు నీటిని అందించిన అభినవ భగీరథుడు ఎన్టీఆర్ అని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు భగీరథ యత్నం చేస్తున్నారన్నారు. త్వరలో మడకశిర వరకు నీటిని తీసుకెళతామన్నారు.