Under world Don Davood Ibrahim targeted a Hyderabad celebrity, for this he ordered Chota Shakeel to deal with a person
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సెలబ్రిటీని చంపేందుకు చోటా షకీల్ తో భారీ డీల్ కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం. అన్నీ సిద్దం చేసుకుని.. ఇక ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ ఈ సంచలన విషయాలు వెల్లడించారు.
గతేడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ ను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు ప్రస్తుతం అతన్నివిచారిస్తున్నారు. హైదరాబాదులోని సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం తాజా విచారణలో బయటపెట్టడం గమనార్హం.
హైదరాబాద్‌కు చెందిన ఆ సెలబ్రిటీని హత్య చేసేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌తో రూ.45 లక్షల ఒప్పందం కుదిరిందని నసీం వెల్లడించాడు. అయితే ఈ ఆపరేషన్ సింగిల్ గా చేయవద్దని, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ మున్నా సింగ్‌తో కలసి చేయాలని చోటా షకీల్ ఆదేశించినట్టుగా నసీం వెల్లడించినట్టు తెలుస్తోంది.
షకీల్ ఆదేశాల మేరకు మున్నా సింగ్‌ను కలిసేందుకు సిద్దమవుతుండగా.. నసీం ప్రధాన అనుచరుడు జునైద్ చౌదరి ఆ సమాచారాన్ని పోలీసులకు లీక్ చేశాడు. దీంతో పక్కా సమాచారంతో నసీంను ఢిల్లీ పోలీసులు గుర్గావ్ లో అరెస్టు చేశారు.