A video of a man torturing his old mother went viral on Friday. The footage shows a man strangling his helpless mother. The incident took place in Shahjahanpur police station in Alwar
అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేస్తే.. ఓ కొడుకు తన తల్లిని వృద్ధాప్యంలో చిత్రహింసలకు గురిచేసి చివరకు ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి(82) తన కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది.
వయో భారం, కొద్ది రోజుల క్రితం పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తరచూ తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది.
కాగా, ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు అతని తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జనవరి 18న తీసిన ఆ వీడియో వైరల్ అయి చివరకు ఫిబ్రవరి 2న ఈ విషయం పోలీసులకు చేరింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జోగేంద్ర ఇంట్లో లేడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.