BJP MP Nepal Singh apologises for his statement on Army, says he was misinterpreted. Watch Video
సైనికుల మరణాలపై బిజెపి పార్లమెంటు సభ్యుడు నేపాల్ సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో ఐదుగురు జవాన్లు మరణించిన సంఘటనపై ఆయన స్పందిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోరాటంలో సాయుధ బలగాలు మరణించని దేశమంటూ లేదని, అది నిత్య వ్యవహారమని ఆయన అన్నారు. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు, చస్తుంటారని, అందులో కొత్తేముందని ఆయన అన్నారు.
సైన్యంలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినప్పుడు - మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోకసభ సభ్యుడైన 77 ఏళ్ల నేపాల్ సింగ్ వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. తీవ్రమైన విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని, ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి అన్నారు. సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన అన్నారు. సైనికులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.