Tamil men accuse Sri Lanka army of torture, Sri Lanka govt says will investigate
శ్రీలంకలో అంతర్గత యుద్ధం ముగిసి ఎనిమిదేళ్లయిందన్నది కేవలం బయటి ప్రపంచాన్ని నమ్మించడానికేనా?.. ఈ ఏడాది జులై వరకు ఆ దాష్టికం కొనసాగిందని బాధితులు చెబుతుంటే ఇంకా శ్రీలంక మాటలను నమ్మాలా?... శ్రీలంక దారుణాలకు బలైపోయి ప్రస్తుతం యూరోప్‌లో తలదాచుకుంటున్న 50మంది తమిళులు తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. వారికి జరిగిన అన్యాయాన్ని వెలికితీసేందుకు కొంతమంది మానవ హక్కుల నిపుణులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. బాధితులు వెల్లడించిన వివరాలు విని మానవ హక్కుల సంఘాలు లంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
21రోజుల పాటు తనను చీకటి గదిలో బంధించారని, ఆ సమయంలో 12సార్లు రేప్ చేశారని ఓ బాధితుడు వాపోయాడు. అంతేకాదు, సిగరెట్స్ తో ఒళ్లంతా కాల్చారని, తలకిందులుగా వేలాడదీసి ఐరన్ రాడ్స్ తో చితకబాదారని చెప్పాడు. శ్రీలంక సైన్యం తమను ఇళ్ల మీదకు వచ్చి మరీ అపహరించుకుపోయిందని చాలామంది తమిళ పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లేవారని.. ఆపై చీకటి గదుల్లో బంధించి చిత్రహింసలకు పాల్పడేవారని చెప్పుకొచ్చారు. దాదాపు సైన్యం అపహరించిన ప్రతీ తమిళ పురుషుడి శరీరం మీద ఇనుప కడ్డీలతో పులి చారికల మాదిరి వాతలను పెట్టడం గమనార్హం. ఈ విషయాలను వెలుగులోకి తెచ్చిన వార్తా సంస్థ దాదాపు 20మంది బాధితులతో మాట్లాడింది.